Tuesday, November 15, 2011

ఓట్లకోసం సమాజాన్ని ముక్కలు చేస్తారా? కోర్టు ముందు నిలిచే బిల్లు కాదు:ఆరిఫ్; బిల్లు వస్తే మనం మిగలం:ఎంవిఆర్ శాస్ర్తీ; మత బిల్లు జిన్నా వాదమే:రాం మాధవ్


November 15th, 2011



హైదరాబాద్, నవంబర్ 14: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మత బిల్లు సమాజాన్ని ముక్కలు చేసేందుకు ఉద్దేశించినట్టు కనిపిస్తోందని కేంద్ర మాజీ మంత్రి ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఆంగ్లేయుల పాలనలోనూ విభజన యత్నాలు జరిగాయని ఇప్పుడు తాజాగా కేంద్రం కూడా అదే పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ‘సోషల్ కాజ్’, ప్రజ్ఞ్భారతి సంస్థలు సంయుక్తంగా మత హింస నిరోధక బిల్లుపై సోమవారం సాయంత్రం కేశవ్ మెమోరియల్ అకడమిక్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సెమినార్‌లో ఖాన్ మాట్లాడారు.

చట్టాలను సవరించుకోవచ్చునని కానీ మానసిక విభేదాలు తలెత్తితే సమసిపోవని, దేశం అంతా సమైక్యం అనే భావనకు భంగం కలిగించేలా ఈ బిల్లు ఉందని ఆయన అన్నారు. వ్యక్తులలో మైనార్టీ, మెజారిటీ అనే నిర్వచనం సరికాదని ఒక రాష్ట్రంలో మైనారిటీగా ఉన్న వారు మరోచోట మెజార్టీగా ఉండొచ్చు, శాశ్వతంగా ఎవరూ మైనారిటీ గానో, మెజారిటీగానో ఉండరు కదా అని అన్నారు. ఏ బిల్లుపైనైనా ముందు చర్చ జరిగితే తర్వాత రచ్చ జరగదని, ముందు చర్చ జరగకపోతేనే వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు.

మత హింస నిరోధక బిల్లు అమలులోకి వస్తే హిందువులు మిగలరని ఆంధ్రభూమి సంపాదకుడు ఎంవిఆర్ శాస్ర్తీ పేర్కొన్నారు. సామాన్య హిందువుల మనుగడ ప్రశ్నార్ధకమవుతుందని, తాము ఈ మతంలో ఎందుకున్నామా అనే ఆలోచనలో పడతారని తెలిపారు. మతాంతరీకరణ ఉద్ధృతంగా జరుగుతున్న దశలో ఇలాంటి చట్టం వస్తే దాని బారిన పడకుండా మత మార్పిడి కోసం ఆలోచించే ప్రమాదం ఉందని అన్నారు. ఇతర మతస్థులను కాపాడేందుకు మత హింస బిల్లు వస్తున్న తరుణంలోనైనా హిందూ మత పెద్దలపై జరుగుతున్న దాడులు మత హింస కిందకు వస్తాయో, రావో ఆలోచించుకోవాలని సూచించారు. ఈ బిల్లుపై ఆలోచించకుండా మనకెందుకు అనుకుంటే మనం కూడా మిగలమని అన్నారు. ఒకపుడు జమ్మూకాశ్మీర్‌లో రెండు రాజ్యాంగాలు ఉన్నందుకే శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆవేదన చెందారని, కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు రాజ్యాంగాలను తెచ్చిపెట్టబోతున్నారని, కనీసం రెండు రాజ్యాంగ న్యాయాలు రాబోతున్నాయని అన్నారు. హిందువులు వౌనంగా ఉన్నా సమస్యలు తప్పబోవని పేర్కొన్నారు.

మత బిల్లు జిన్నావాదానే్న తెరమీదకు తెస్తోందని ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు రాం మాధవ్ అన్నారు. జిన్నా వాదన భూమిక ఆధారంగానే ఈ బిల్లు రూపొందించినట్టు కనిపిస్తోందని, సహజన్యాయానికి తావులేకుండా వివక్ష పూరితంగా ఈ బిల్లు ఉందని ఆరోపించారు. ఈ బిల్లు అమలులోకి వస్తే మతాల మధ్య సుహృద్భావం అసాధ్యమవుతుందని, ఈ బిల్లు చట్టం కాకుండా ఆపాల్సిన బాధ్యత అందరిపై ఉందని అంటూ రాం మాధవ్ అనేక అంశాలను ప్రస్తావించారు. జాతీయ సలహా మండలి ఈ బిల్లు ముసాయిదా తయారుచేయడానికి ఉన్న స్థాయిత్వం ఏమిటో అర్ధం కావడం లేదని అన్నారు. ఐక్యతకు మహాత్మాగాంధీ అన్ని విధాలా కృషి చేసినా, జిన్నా మాత్రం దేశ విభజనకే మొగ్గుచూపారని, బిల్లును వ్యతిరేకించే వారందిరినీ మతతత్వ వాదులుగా చూడటం దారుణమని అన్నారు. ఈ బిల్లు వచ్చాక ఉన్న అధికారాలు కాస్తా కేంద్ర ప్రభుత్వానికి ధారాదత్తం అవుతాయని పేర్కొన్నారు. దేశ ఐకమత్యాన్ని ఈ బిల్లు ముక్కలు చేస్తుందని, ఇలాంటి బిల్లునే 2007లో హోస్ని ముబారక్ ఇరాక్‌లో తేవడం వల్ల మూడేళ్లు తిరగకుండా అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసునని చెప్పారు.

పోలీసు వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి

మత బిల్లు సమాజం మరింత విడిపోయేందుకు తోడ్పడేలా ఉందని మాజీ డిజిపి సి ఆంజనేయరెడ్డి అన్నారు. బాధితులకు పరిహారం చెల్లించే అంశం తప్ప ఈ బిల్లులో పనికొచ్చే క్లాజులు ఏవీ లేవని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసు యంత్రాంగానికి అధికారాలు ఉన్నాయని, ఇపుడు కొత్తగా అధికారాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఉన్న చట్టాలను పటిష్టంగా అమలుచేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను స్వతంత్య్ర వ్యవస్థగా తీర్చిదిద్దితే సరిపోతుందని అన్నారు.

దేశానికి అప్రతిష్ట తేచ్చే బిల్లు: టిహెచ్ చౌదరి

మత బిల్లు దేశానికి అప్రతిష్ట తేచ్చేదేనని రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు టి. హనుమాన్ చౌదరి చెప్పారు. జాతీయ సలహా మండలి సభ్యులు హిందూ సంస్కృతిని తెగనాడటమే పనిగా పెట్టుకుని ఈ ముసాయిదాను రూపొందించారని అన్నారు. లక్షల కోట్ల రూపాయిల నిధులను సమీకరించి మత మార్పిడులకు పాల్పడుతున్నారని, ఎన్‌ఎసి నవీన దుష్ట చతుష్టయంగా తయారైందని ఎద్దేవా చేశారు. ఏ మత ఘర్షణ జరిగినా దానికి కారకులు హిందువులే అని ఈ చట్టం చెబుతుందని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయని తెలిపారు.

(చిత్రం) మత బిల్లుపై ‘సోషల్‌కాజ్’, ప్రజ్ఞ్భారతి సంస్థలు నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి ఆరిఫ్ మహ్మద్ ఖాన్. వేదికపై ఆర్‌ఎస్‌ఎస్ సెంట్రల్ కమిటీ సభ్యుడు రాంమాధవ్, మాజీ డిజిపి సి. ఆంజనేయ రెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు టి.హనుమాన్ చౌదరి, ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవిఆర్ శాస్ర్తీ ఉన్నారు.

http://www.andhrabhoomi.net/state/o-191

No comments:

Post a Comment