Monday, November 21, 2011

భారతీయ 'బహుళజాతి' జయపతాక - భరత్ ఝన్ ఝన్‌వాలా

ఎంత మార్పు! ఇరవై సంవత్సరాల క్రితం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విషయమై మన దేశ ఆర్థికవేత్తలలో తీవ్ర వాదోపవాదాలు నడిచాయి. ఆనాడు ఆర్థిక వ్యవస్థలోకి ఎఫ్‌డిఐని అనుమతించారు. దీనివల్ల మన దేశం మరోసారి వలసపాలనలోకి వెళ్ళిపోయే ప్రమాదముందని స్వదేశీ వాదులు విమర్శించారు. బహుళజాతి కంపెనీలు దేశంలోకి ప్రవేశించి దేశీయ కంపెనీలను అణచివేస్తాయని వారు వాదించారు. వచ్చిన లాభాలను విదేశీ కంపెనీలు తమ స్వదేశానికి తరలిస్తాయని దీని వల్ల మన ఆర్థిక వ్యవస్థ అమితంగా నష్టపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇవి నిరాధార భయాందోళనలని రుజువయింది. మన దేశం ప్రశంసనీయమైన మధ్యేమార్గం అనుసరించడం వల్ల ఎఫ్‌డిఐ, దేశీయ పెట్టుబడులకు మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. బహుళ జాతి సంస్థలు మన కంపెనీలను అణచివేయడం కాదు కదా మన కంపెనీలే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో తమ పెట్టుబడులను పెద్ద ఎత్తున పెట్టే స్థితికి ఎదిగాయి.


మన దేశంలో విదేశీ కంపెనీల ఎఫ్‌డిఐ 2009-10లో 18.8 బిలియన్ డాలర్ల నుంచి 2010-11లో 7.1 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. అంటే 62 శాతం తగ్గిపోయాయన్న మాట. ఇదే సమయంలో విదేశాల్లో భారతీయ కంపెనీల ఎఫ్‌డిఐ 144 శాతం పెరిగాయి. అంటే విదేశాల్లో మన కంపెనీల పెట్టుబడులు 18 నుంచి 43.92 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గత ఏడాది మన కంపెనీలు స్వీకరించిన ఎఫ్‌డిఐ కంటే ఆరు రెట్లు ఎక్కువగా విదేశాలకు తమ పెట్టుబడులను పంపాయి. విదేశాల్లో మన కంపెనీల ఎఫ్‌డిఐ పెరగడం అవి ప్రపంచ అగ్రగాములుగా ఆవిర్భవిస్తున్నాయనడానికి సూచన. ఇరవై ఏళ్ళక్రితం మన ప్రభుత్వం ప్రారంభించిన సరళీకృత ఆర్థిక విధానాల మూలంగా అవి విదేశీ బహుళజాతి సంస్థల నుంచి ఎదురైన పోటీకి కునారిల్లిపోలేదు. పైగా ఆ విదేశీ సంస్థలను వాటి స్వదేశాల్లోనే సవాల్ చేయగలుగుతున్నాయి. 1990ల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయమై జరిగిన చర్చలో ఏ పక్షమూ 'విజయం' పొందక పోవడం వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది.

భారతీయ పారిశ్రామికులు, వ్యాపారవేత్తల్లో ఇప్పుడొక నూతన ఆత్మవిశ్వాసం నిండుగా తొణికిసలాడుతోంది. స్వదేశీ ఆర్థికవేత్తలు వర్తమాన వాస్తవాలకు అనుగుణంగా ఆలోచించడం లేదన్న విషయాన్ని ఇది స్పష్టం చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో సమకూరే స్వల్పకాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయనేది వారి వాదన. ఎఫ్‌డిఐ లాభాలను విదేశీ కంపెనీలు తమ స్వదేశానికి తరలించడం అనివార్యం కనుక మనం సమస్యల పాలవుతామని స్వదేశీ ఆర్థికవాదులు అన్నారు.

అసలు ప్రభుత్వం ఎఫ్‌డిఐని ఎందుకు అనుమతించింది? దేశీయ కంపెనీలు అంతర్జాతీయ పోటీని ఎదుర్కొనేలా దేశీయ కంపెనీలను తీర్చిదిద్దేందుకు కాదు (లక్ష్యం ఇదే అయితే ఎఫ్‌డిఐని ఆహ్వానించవచ్చు); అవి తమకవసరమైన రుణాలను దేశీయ ద్రవ్య మార్కెట్‌లో సులువుగా పొందేందుకే ఎఫ్‌డిఐని అనుమతిస్తున్నారు కాబట్టే తాము అభ్యంతరం చెబుతున్నామని స్వదేశీ వాదులు అన్నారు. ఇక విచక్షణారహితంగా ఎఫ్‌డిఐని అనుమతించడం వల్ల మనకు అత్యాధునిక సాంకేతికతలు సమకూరవని వారు వాదించారు. ఏమైనా మన ఆర్థిక వ్యవస్థకు 'అనుకూలంగా' ఉండేలా బహుళజాతి సంస్థల పెట్టుబడులను అనుమతించాలనేది స్వదేశీ ఆర్థికవేత్తల డిమాండ్. ప్రభుత్వ మద్దతుతో గాక సొంత శక్తిపై ఆధారపడి అంతర్జాతీయ పోటీని ఎదుర్కొనే స్తోమతను దేశీయ కంపెనీలు సాధించుకోవడమే లక్ష్యంగా ఉండాలి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కాక మన పారిశ్రామిక, వ్యాపార సామర్థ్యాలను పెంపొందిచుకోవడమే లక్ష్యంగా ఉండాలని స్వదేశీ ఆర్థిక వేత్తలు వాదించారు.

స్వదేశీ ఆర్థిక వేత్తల ఆక్షేపణ మూలంగా మన ఆర్థిక వ్యవస్థను విదేశీ పెట్టుబడులకు తెరిచే ప్రక్రియ మందగించింది. బీమారంగంలో విదేశీ పెట్టుబడులను 25 శాతానికే పరిమితం చేయడమే ఇందుకొక ఉదాహరణ. ఇలా జరిగడం మన ఆర్థిక వ్యవస్థకు మేలుచేసిందా, హాని చేసిందా అనేది చెప్పడం కష్టం. శీఘ్రగతిన పూర్తిస్థాయిలో విదేశీ పెట్టుబడులను అనుమతించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? మన వ్యాపార సంస్థలు కుప్పకూలిపోయివుండేవన్న అభిప్రాయం ఒకటి గట్టిగా ఉంది. ఏమైనా ఇటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం లభించడం కష్టం.

వాటిని తర్కించడం వల్ల పెద్దగా ఉపయుక్తత కూడా ఏమీ ఉండదు. అదలా ఉంచితే మన కంపెనీలు విదేశీ బహుళజాతి సంస్థల పోటీని సమర్థంగా ఎదుర్కోవడమే కాదు వాటిని సవాల్ చేస్తున్నాయి. ఇప్పుడు మన ముందున్న సవాల్ ఏమిటంటే ఇతర వర్ధమాన దేశాలకు నాయకత్వాన్ని అందించడం. ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టడంలో మనం పాశ్చాత్య బహుళజాతి సంస్థల మార్గంలో నడవకూడదు. పాశ్చాత్య కంపెనీలు 1960ల్లో ఆఫ్రికాలో, 1970, 80ల్లో లాటిన్ అమెరికాలో, 1990ల్లో తూర్పు ఆసియాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉన్నాయో మరి చెప్పనవసరం లేదు. విదేశీ పెట్టుబడులను అడ్డు అదుపూ లేకుండా అనుమతించడం వల్ల ఆఫ్రికా, లాటిన్ అమెరికా, తూర్పు ఆసియా దేశాల్లో ని దేశీయ కంపెనీలు బహుళజాతి సంస్థల పోటీని ఎదుర్కొలేకపోయాయి. అంతేకాదు గట్టి పోటీనివ్వాలనే సంకల్పాన్నే కోల్పోయాయి.

మరి మన దేశం కొత్త బహుజాతి కంపెనీల సంస్కృతిని సృష్టించగలదా? వర్ధమానదేశాల్లో పెట్టుబడులు పెట్టి, ఆర్జించిన లాభాలను స్వదేశాలకు తరలించడమే పాశ్చాత్య బహుళజాతి కంపెనీల లక్ష్యంగా ఉంది. దీనివల్ల తమకు ఆతిథ్యమిచ్చిన దేశాలు ఎన్ని విధాలా నష్టపోయినా అవేమీ పట్టించుకోవడం లేదు. వర్థమానదేశాల అభివృద్ధికి పాశ్చాత్య కంపెనీలు చేస్తున్న దోహదం చాలా చాలా స్వల్పం. నిజానికి చేస్తున్న మేలు కంటే హానే ఎక్కువ. విదేశాల్లో పెట్టుబడులు పెడుతోన్న భారతీయ కంపెనీలకు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి-పాశ్చాత్య కంపెనీల విధానాలనే అనుసరించడం. తద్వారా తాము ఆర్జించిన లాభాలను స్వదేశానికి తరలించి, ఆతిథేయ దేశ సమస్యలను నిర్లక్ష్యం చేయడం. రెండోది- తాము పెట్టుబడులుపెడుతున్న దేశం కూడా ఆర్థికంగా పురోగమించేందుకు దోహదం చేయడం. అంటే అక్కడ ఆర్జించిన లాభాలను పూర్తిగా కానప్పటికీ గణనీయంగా సంబంధిత దేశంలోనే మళ్ళీ మదుపు చేయడం.

(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)

https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/8/edit/8edit2&more=2011/nov/8/edit/editpagemain1&date=11/8/2011


No comments:

Post a Comment