Friday, January 13, 2012

మన చరిత్రను తెలుసుకొందాం - 11వ భాగం


ప్రాచీన క్షాత్ర పరంపర కలిగిన మన భారతీయ సమాజం నిన్న మొన్న కళ్ళు తెరిచిన విదేశీ జాతుల చేతులలో వోడి, వారికి తల వంచి వారి పరిపాలనకు లోబడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? తెలుసుకుందాం? చదవండి ! మన చరిత్రను తెలుసుకుందాం ! ధారావాహిక ప్రతి నెల.

సముద్ర మార్గంలో వాస్కోడిగామా ఆగమనం

క్రీ.శ.1453 లో కాన్ స్టాంటినోపుల్ తురుష్కుల వశమయ్యాక యూరప్ వ్యాపారాలు భారతదేశానికి వచ్చి వెళ్ళే భూతల మార్గానికి అడ్డు ఏర్పడింది. భారత్ తో వ్యాపారం యూరప్ రాజ్యాల ఆర్ధిక వ్యవస్థలకు అత్యవసరమై ఉండేది. యూరప్ నావికులు భారత్ కు సముద్ర మార్గాన్ని అన్వేషించ సాగారు. క్రీ.శ. 1498 లో పోర్చుగీసు వవికుడైన వాస్కోడిగామా భారత దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. భారత దేశపు సరుకుల వ్యాపారం కొన్నాళ్ళు పోర్చుగీసువారి చేతుల్లో ఉండేది. క్రీ.శ.1578 లో ఈ సముద్ర మార్గపు వివరాలు ఇంగ్లీషు వారికి చిక్కాయి. క్రీ.శ.1600 లో భారత దేశంలో వ్యాపారం కొరకై ఈస్టిండియా కంపెనీ అనే ఇంగ్లీషు వారి వ్యాపార సంస్థ స్థాపించా బడింది. ఈ కంపెనీ క్రీ.శ.1613 లో జహంగీర్ చక్రవర్తి వద్ద నుంచి సూరత్ లో ఒక ఫ్యాక్టరీ కట్టుకోనేందుకు అనుమతి పొందారు. క్రమంగా ఫ్రెంచి వారు, డచ్చి వారు కూడా భారత్ కు వ్యాపారం నిమిత్తమై వచ్చారు.

వ్యాపారులుగా వచ్చి.. రాజులుగా మారి..
 
ఇలా వర్తకం కొరకు వచ్చిన యూరప్ జాతుల వారికి ఈ దేశపు ప్రజలలో జాతీయ భావన లేదని, ఇక్కడి రాజ్యాలకు ఆధునిక యుద్ధ సాధనాలు, ఆయుధాలు లేవని, ఇక్కడి సైన్యాలు యుద్ధ తంత్ర నైపుణ్యంలో వెనుకబడి ఉన్నాయని అర్థమైంది. ఈ దేశపు వ్యక్తులలో తెలివి తేటలకు, ధైర్య సాహసాలకు లోటు లేదని, వీరికి యూరప్ దేశాల యుద్ధ రీతులలో శిక్షణ నివ్వడం తేలికేనని కూడా వారు గ్రహించారు. అలా తయారైన సైన్య దళాలు తమ యురోపియన్ యజమానుల కోసం స్థానిక రాజ్యాలపై యుద్ధాలు చేయడానికి ఉపయోగ పడ్డాయి. ఆ విధంగా భారత్ పై ఆధిపత్యాన్ని స్థాపించుకినేందుకు యూరప్ జాతుల మధ్య జరిగిన పోటీలో ఇంగ్లీషు వారిది పైచెయ్యి అయింది. క్రీ.శ.1757 లో రాబర్ట్ క్లైవ్ బెంగాల్ ను జయించాక క్రమంగా భారతీయ సంస్థానాలన్నీ ఈస్టిండియా కంపెనీ వారికి లొంగిపోయాయి. గోవా, డయ్యు డామన్ మాత్రం పోర్చుగీసు వారి పాలనలోను, యానాం, మాహే, కరైకాల్ ఫ్రెంచ్ వారి పాలనలోనూ మిగిలాయి. 

1857 భారత స్వాతంత్ర్య సంగ్రామం 

ఇలా జాతీయ భావ శూన్యులై జీతాల కోసం ఇంగ్లీషువారి దగ్గర సైనికులుగా చేరి వారికి దేశమంతా జయించి అప్పచెప్పిన భారత సిపాయిలకు ఆంగ్లేయులు మన మతధర్మాలకు చేస్తున్న అవమానాలను చుస్తే కోపం వచ్చింది. వాళ్ళు కొందరు స్వదేశీ సంస్థానాధిపతులతో  కలిసి క్రీ.శ.1857 లో ఇంగ్లీషు వారిపై తిరుగుబాటు చేశారు. భారతీయులు సాగించిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామాన్ని
సిక్కులు, గూర్ఖాలు, నైజం నవాబు ఇచ్చిన సహకారంతో ఇంగ్లీషువారు అణచి వేశారు. 

విద్యా విధానం ద్వారా వేర్పాటువాద పాఠాలు 

సుమారు 150 సంవత్సరాలు మన దేశం ఇంగ్లీషు వారి పరిపాలనలో ఉంది. ఇంగ్లీషు వారు భారతదేశంలో పరంపరాగతంగా కొనసాగుతున్న పరిశ్రమలను, ఆర్థిక వ్యవస్థను, దేశీయ విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు. భారత ప్రజల స్వాభిమానాన్ని, స్వీయ ధర్మ సంస్కృతులపై వారికున్న మమకారాన్ని దెబ్బ తీయడానికి మెకాలే రూపొందించిన విద్యా విధానాన్ని అమలు చేశారు. ఆర్యులు బయటి నుంచి వచ్చిన దండయాత్రికులని, వారు స్థానికులైన ద్రావిడుల నాగరికతను ధ్వంసం చేశారని కట్టు కథలు కల్పించి చరిత్ర పాఠాలలో జొప్పించి ఆర్యద్రావిడ విభేదాలను భారత ప్రజలలో వ్యాపింపచేశారు. సిక్కుమతం హిందుత్వపు పరిధిలోకి రాని భిన్నమైన మతమని ప్రచారం చేసి సిక్కులలో వేర్పాటు వాదానికి బీజం వేశారు. ఈశాన్య భారత ప్రాంతంలోకి మిగతా ప్రాంతాల నుంచి రాకపోకలు నిషేధించి అక్కడకు క్రైస్తవ మిషనరీలను పంపి 7, 8 దశాబ్దాలు ప్రయత్నం చేసి అక్కడి నాగాలు, మిజోలు మొదలైన జాతులను పెద్ద ఎత్తున క్రైస్తవ మతంలోకి మార్చారు. హిందూ సమాజంలో అస్పృశ్యులు అనబడే వారిని మిషనరీలు ప్రచారానికి గురి చేసి మూకుమ్మడిగా క్రైస్తవ మతంలోకి మార్చారు. విద్యా సంస్థలను, ఆసుపత్రులను స్థాపించి వాటిని అత్యధికంగా మత ప్రచారానికి, మత మార్పిడులకు ఉపయోగించారు. 

పోర్చుగీసు వారు తమ అధీనంలో ఉన్న గోవాలో పెద్ద ఎత్తున ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చారు. క్రైస్తవ మతం పుచ్చుకోవడానికి తిరస్కరించిన హిందువులను ఇంక్విజిషన్ పేరుతో వేల సంఖ్యలో మరణ శిక్షలకు గురి చేశారు. అనేక హిందూ దేవాలయాలను కూల్చారు. 

భారతీయులలో చైతన్యం నింపిన వివేకానంద 

క్రీ.శ.1893 లో చికాగోలో జరిగిన విశ్వమత మహా సభలలో హిందూ సన్యాసి వివేకానందుని ఉపన్యాసాలు ప్రపంచ మంతటినీ అబ్బురపరచి ఆకర్షించాయి. దానితో హిందూ ధర్మానికి, దాని సిద్ధాంతాలకు తిరిగి ప్రపంచ వ్యాప్తంగా గౌరవం వెల్లువెత్తింది. ఈ పరిణామంలో హిందూ సమాజంలో స్వాభిమానం చిగురించింది. భారతీయులలో సర్వతోముఖమైన జాతీయ పునరుజ్జీవనం కొరకు ఆకాంక్ష బయలు దేరింది. విదేశీ పాలన నుంచి బయటపడే ఉద్యమాలు కూడా ఆరంభమైనాయి.  గాంధీజీ నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ నడిపిన ఉద్యమాన్ని ప్రజలలో అత్యధికులు అనుసరించారు. గాంధీజీ తాను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఇంగ్లీషువారి వర్ణ విచక్షణకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి పేరు తెచ్చుకున్నాడు. అక్కడ ఉన్న కాలంలోనే అయన అహింసా పద్ధతిలో సత్యాగ్రహం అనే ఉద్యమ విధానానికి రూపకల్పన చేసుకున్నాడు. ఆ విధానాన్ని అయన భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రవేశ పెట్టాడు.  

విభజనకు నాంది - ముస్లిం లీగ్ 

మరొకవైపున భారత ముస్లిం సమాజంలో మతాధిపతులైన ఉలేమాలు కొత్త మదరసాలు స్థాపించి, వారిలో ప్రత్యేక వర్గ స్పృహ బలపడడానికి కృషి చేశారు. క్రీ.శ.1875 లో సర్ సయ్యద్ అహమద్ ఖాన్ స్థాపించిన అలీఘర్ కళాశాల కేవలం ఒక కళాశాలగానే కాక ముస్లిం సమాజ సంఘటనకు ఉద్దేశించబడ్డ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. భారత ముస్లింల రాజకీయ ప్రయోజనాల కొరకై పని చెయ్యడానికి క్రీ.శ.1906 లో ముస్లిం లీగు అనే పార్టీ స్థాపించబడింది. కాంగ్రెస్ సాగిస్తున్న జాతీయోద్యమానికి ముస్లిం నేతలు దూరంగా ఉంటూ తమకు మతపరమైన ప్రత్యేక అంశాలపై శ్రద్ధ వహించసాగారు. భారత జాతీయ సమస్యల పట్ల కాక వారు ప్రపంచ ముస్లిం ప్రజానీకపు స్థితిగతుల పట్ల ఆసక్తి, ఆందోళన చూపించేవారు.  

- మణి   
 http://www.lokahitham.net/2011/11/11.html

No comments:

Post a Comment