Friday, January 13, 2012

మన చరిత్రను తెలుసుకొందాం - 12వ భాగం


ప్రాచీన క్షాత్ర పరంపర కలిగిన మన భారతీయ సమాజం నిన్న మొన్న కళ్ళు తెరిచిన విదేశీ జాతుల చేతులలో వోడి, వారికి తల వంచి వారి పరిపాలనకు లోబడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? తెలుసుకుందాం? చదవండి ! మన చరిత్రను తెలుసుకుందాం ! ధారావాహిక ప్రతి నెల.

ఖలీఫా కోసం ఉద్యమాన్ని పణంగా పెట్టిన గాంధీజీ 
 
అప్పుడు టర్కీ సుల్తాను విస్తార సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఖలీఫా అనే బిరుదును వహించి ఉండేవాడు. ఖలీఫా అంటే ప్రపంచ ముస్లిం ప్రజానీకానికి అధిపతి, భూమిపై అల్లా ఛాయ అని భావించేవారు. క్రీ.శ. 1914 నుంచి 1919 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఇంగ్లాండుకు వ్యతిరేక పక్షంలో పోరాడి ఓటమి చెందింది. ఈ పరిస్థితిలో భారత దేశంలోని ముస్లిం నేతలు టర్కీ సామ్రాజ్యపు సరిహద్దులను, ఖలీఫా యొక్క అధికారాలను యథాతథంగా ఉంచాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖిలాఫత్ ఉద్యమాన్ని ఆరంభించారు. ఈ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తే భారత ముస్లింలు స్వాతంత్ర్య పోరాటంలో సహకరిస్తారని, హిందువుల పట్ల స్నేహాన్ని అవలంబిస్తారని, గోవధను తమంత తామే మానుకుంటారని భావించిన గాంధీజీ ఎందరు అడ్డు చెప్పినా వినకుండా ఖలీఫా పీఠ
పు ఉనికి భారత జాతీయ సమస్య అయినట్లుగా కాంగ్రెస్ పార్టీని, భారత ప్రజలను ఆ ఉద్యమంలోకి దించాడు. తన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఖిలాఫత్ ఉద్యమానికి జోడించి నడిపాడు. కాని ప్రపంచ యుద్ధపు ఒప్పందాలను శాసించే బలం ఈ ఉద్యమానికెక్కడుంది? టర్కీ సామ్రాజ్యం ముక్కలు ముక్కలుగా చేయబడి సౌదీ అరేబియా, ఇరాక్, లిబియా, సిరియా, జోర్డాన్, యెమెన్, బిమన్ మొదలైన రాజ్యాలు ఏర్పడ్డాయి. ఖలీఫా పదవి రద్దు చేయబడి టర్కీ 1923 లో ఒక రిపబ్లిక్ గా అవతరించింది. 

మోఫ్లా మారణకాండ - పాఠాలు నేర్వని గాంధీజీ
 

ఖిలాఫత్ ఉద్యమం చివరి దశలో కేరళలోని మోఫ్లా జాతి ముస్లింలు ఆంగ్ల ప్రభుత్వంపై జిహాద్ ప్రకటించారు. ఆ విప్లవాన్ని బ్రిటీష్ ప్రభుత్వం కఠినంగా అణచి వేసింది. 2226 మంది జిహాదీ మోఫ్లాలు వధించబడ్డారు. ఈ వైఫల్యం వల్ల కలిగిన ఆగ్రహాన్ని మోఫ్లాలు అప్పటి వరకు తమతో సహకరించిన హిందువులపై వెళ్ళగ్రక్కారు. 1500 మంది హిందువులను హత్య చేశారు. 20 వేల మందిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. హిందూ స్త్రీలపై జరిగిన మానభంగాలకు, అపహరణలకు లెక్కే లేదు. ఇస్లామిక్ మత భావనలను సంతుష్టి పరచడం ద్వారా హిందూ ముస్లిం ఐక్యతను సాధించ గలనన్న గాంధీజీ నమ్మకం ఇలా బెడిసి కొట్టింది. అయన "నేను హిమాలయమంత పొరపాటు చేశాను" అని తరువాత ప్రకటించాడు. కాని ఆ పొరపాటును ఎప్పుడూ సరిదిద్దుకోలేదు. 

ముస్లిం సంతుష్టీకరణకే ప్రాధాన్యత
 

జాతీయ విప్లవ గీతమైన "వందేమాతరం" పట్ల ముస్లింలు అయిష్టత ప్రకటించడంతో గాంధీజీ ఆ గీతం యొక్క ప్రాముఖ్యాన్ని తగ్గించాడు. శివాజీ, రాణాప్రతాప్, గురుగోవింద్ సింగ్ వంటి జాతీయ వీరులు ముస్లింలకు అప్రియమైన వారన్న కారణంతో కాంగ్రెస్ వేదికలపై వారి ప్రస్తావన, ప్రశంసలను మానిపించాడు. భారత్ లో గాంధీజీ ఆరంభించిన ఉద్యమాన్ని ఈ విధంగా మొదటి దశలోనే ఇస్లాం మతతత్వం హైజాక్ చేసేసి దానిపై తన ముద్ర వేసింది.  

జాతిని నడిపించలేని జాతీయ ఉద్యమాలు
 

ఆ తరువాత గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన ఉద్యమాలను నిర్వహించాడు. వాటితో ఆయనకు వ్యక్తిగతమైన కీర్తి ప్రతిష్టలు, మహాత్ముడు అన్న బిరుదు వచ్చాయి గాని దేశానికి స్వాతంత్ర్యం రాలేదు.

మహమ్మదాలీ జిన్నా - పాకిస్తాన్ డిమాండ్
 

అప్పటి వరకు జాతీయవాదిగా, మతతత్వానికి వ్యతిరేకిగా ఉన్న మహమ్మదాలీజిన్నా ముస్లిం లీగులో చేరి దానికి అధ్యక్షుడై "ముస్లింలు, హిందువులు - రెండు వేరు వేరు జాతులు. ముస్లింలకు ప్రత్యేక రాజ్యంగా పాకిస్తాన్ కావాలి" అని డిమాండ్ చేశాడు.  

ఇంగ్లాండ్ భిక్ష - గాంధీజీ నిస్సహాయ స్థితి
 

ఇంగ్లాండ్ రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచింది గాని ఆర్ధికంగా బలహీనపడి ప్రపంచంలోని తన వలసలను నిర్వహించుకునే శక్తిని కోల్పోయింది. ఆ కారణంగా బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదలచుకున్నారు. ఆ పరిస్థితిలోనే ముస్లిం లీగు వేర్పాటు వాదం తలెత్తింది. 1944 సెప్టెంబర్ 9వ తేదీన బొంబాయిలో గాంధీజీ జిన్నాను కలుసుకున్నాడు. ముందు స్వాతంత్ర్యం వచ్చేందుకు కాంగ్రెసుతో సహకరించవలసిందని, తరువాత పాకిస్తాన్ ను ఏర్పాటు చేసుకోవచ్చునని జిన్నాను అర్ధించాడు. కాని జిన్నా అంగీకరించలేదు. ముందుగానే పాకిస్తాన్ ఏర్పాటు జరగాలని పట్టుపట్టాడు. హిందువులు, ముస్లింలు వేరు వేరు జాతులన్న విషయాన్ని అంగీకరించవలసిందని జిన్నా కోరాడు. భారత ముస్లింలలో అత్యధికులు మొదట హిందువులై ఉండి తరువాత మతం మార్చబడ్డ వారేనని, కనుక హిందువులు, ముస్లింలు వేరు వేరు జాతులు కాదని గాంధీజీ అన్నారు. మూడు వారాల పాటు జరిగిన గాంధీ - జిన్నా చర్చలు విఫలమయ్యాయి. ఆ తరువాత గాంధీజీ "మధ్యంతర ప్రభుత్వంలో జిన్నానే ప్రధాన మంత్రిగా చెయ్యండి, మంత్రి వర్గంలో అందరినీ ముస్లింలనే నియమించుకోమనండి, నాకు సమ్మతమే" అని వైస్రాయితో అన్నాడు. కాని జిన్నా దీనికి కూడా ఒప్పుకోలేదు. తనకు కావలసింది దేశ విభజనే అన్నాడు.  

హిందువులపై ప్రత్యక్ష చర్య - ముక్కలైన భారత్
 

పాకిస్తాన్ సాధనకై ప్రత్యక్ష చర్య సాగించవలసిందని జిన్నా ముస్లింలకు పిలుపునిచ్చాడు. 1946 ఆగస్టు 16 నుంచి ముస్లింలు హిందువులపై హత్యలు, దహనకాండ, మానభంగాలు, దోపిడీలు పెద్ద ఎత్తున ఆరంభించారు. బ్రిటిష్ సాయుధ బలగాలు కలగచేసుకోలేదు. అహింసతో సమస్తం సాధించవచ్చని, సత్యాగ్రహం తిరుగులేని ఆయుధమని తాను నమ్మి, ప్రజలను నమ్మించిన గాంధీజీ వద్ద ఈ పరిస్థితిని ఎదుర్కొనే వ్యూహం లేకపోయింది. చివరకు దేశ విభజన జరిగిపోయింది. గత శతాబ్దాలలో విదేశీ మూకల ఆక్రమణలు, నిర్బంధ మత మార్పిడులు అత్యధికంగా జరిగిన ప్రాంతాలు పాకిస్తాన్ పేరుతో ప్రత్యేక ముస్లిం రాజ్యంగా ఏర్పడ్డాయి. 

మిగిలిన భారత్ కూడా హిందువులది కాలేదు
 

మిగిలిన భారతదేశం కూడా హిందూ రాజ్యం కాలేదు. ఇక్కడ మైనార్టీల పేరుతో ఇక్కడే ఉండిపోయిన ముస్లింలకు క్రైస్తవులకు కూడా ప్రత్యేక హక్కులు, మత మార్పిడి సౌకర్యాలు ఏర్పడ్డాయి. హిందుత్వాన్ని వ్యతిరేకించడమే సెక్యులరిజం అన్న అర్థం ఆచరణలోకి వచ్చింది. క్రైస్తవ, ముస్లిం మనోభావాలను సంతుష్టి పరుస్తూ హిందుత్వాన్ని బలిపెట్టడమే ఓటు రాజకీయాలలో పైకి రావడానికి మార్గంగా రాజకీయ నాయకులు భావిస్తున్నారు. హిందువు, హిందుత్వం అనే మాటలు అగౌరవకరమైన పదాలై పోయాయి.

రామజన్మభూమి ఉద్యమం
 

ఈ పరిస్థితులలో రామజన్మభూమి ఉద్యమం ఒక ప్రత్యేకమైన, ప్రాముఖ్యం గల సంఘటన.  పదహారవ శతాబ్దిలో బాబరు సేనాపతి అయోధ్య లోని రామాలయాన్ని కూల్చి దాని స్థానంలో మసీదును నిర్మించినప్పటి నుంచీ (దానినే బాబరీ మసీదు అంటారు.) హిందువులు ఆ స్థలం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి తరతరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక హిందుత్వ సంస్థలు అదే ఉద్యమాన్ని చేపట్టాయి. కాని ముస్లిం సంతుష్టీకరణను పరిపాలనా విధానంగా అనుసరిస్తున్న ప్రభుత్వం దోపిడీ సొత్తు దోపిడీ దారుకే చెందాలన్న సిద్ధాంతంతో ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించడానికి సమ్మతించలేదు. దీనితో హిందూ సమాజంలో ఆగ్రహం ఉవ్వెత్తున లేచింది. 1992 డిశంబరు 6వ తేదీన హిందుత్వ ఉద్యమకారులు రామజన్మభూమిలోని బాబరీ కట్టడాన్ని కూల్చివేశారు. దేశ రాజకీయాలలో హిందుత్వవాదం బలం పుంజుకుంది. కాని అది కొంతమేరకే. ఎందుకంటే ఈ ఉద్యమం ఒక హిందూ దేవాలయం యొక్క పునరుద్ధరణను మాత్రమే కోరుతూ సాగింది గాని దేవాలయ విధ్వంసకాండ వెనుక గల మనస్తత్వాన్ని, సిద్ధాంత జాలాన్ని సమగ్రంగా ఖండిస్తూ, అందులో పరివర్తన కోరుతూ సాగలేదు. అందుచేత హిందూ సమాజంలో కలిగిన జాగృతి అసంపూర్ణంగానూ, అసమగ్రంగానూ ఉండిపోయింది. ఇస్లాం మనస్తత్వంలో అపరాధ భావన, పరమతాల పట్ల సామరస్య భావన అనేది ఏర్పడలేదు. 

పెరిగిపోతున్న ఇస్లాం, క్రైస్తవాల ఆగడాలు
 

ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవ మతశక్తులు, కాశ్మీర్ లో ఇస్లాం మతశక్తులు వేర్పాటువాదాన్ని రాజేస్తున్నాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి దేశంలో తిష్ఠ వేసిన 2 కోట్ల ముస్లింలను వెనక్కు పంపగల పరిస్థితి కనబడడం లేదు. దేశంలోని తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ తోడ్పాటునందిస్తూ విధ్వంసాలు జరిపిస్తోంది. ఇస్లామిక్ మదరసాలు ముస్లిం బాలలకు హిందువులపై ద్వేషాన్ని, కాఫిర్ జిహాద్ భావనలను ఉగ్గుపాలతో నూరిపోస్తున్నాయి. క్రైస్తవ మిషనరీలు విదేశీ నిధులతో యధేచ్చగా మతమార్పిడులు సాగిస్తున్నారు. మతమార్పిడి అవకాశాలు సృష్టించుకోవడం కోసమే విద్యా సంస్థలను, ఆసుపత్రులను, సేవా సంస్థలను నడుపుతున్నారు. దేశాన్ని ఏలుతున్న రాజకీయ వర్గం హిందూ ధర్మాన్ని ధ్వంసం చెయ్యడమే సాంస్కృతిక విధానంగా, కుంభకోణాలే ఆర్థిక విధానంగా, అవినీతే పరిపాలనా విధానంగా మనుగడ సాగిస్తోంది. 

నేటి సంతానంపై భారత్ భవిష్యత్తు
 

ఇస్లాం, క్రైస్తవ మతాల విద్వేష శీలతను ఎదుర్కొని నిలద్రొక్కుకోవడానికి  భారతీయత, హిందుత్వం సాగిస్తున్న పోరాటమే గత వెయ్యేళ్ళ భారతదేశ చరిత్ర. ఈ కాల ఖండంలో హిందువులు తమ మాతృభూమిలో మూడవ భాగాన్ని కోల్పోయారు, తమ సోదర ప్రజలలో మూడవ వంతును ఆ విదేశీ మతాలకు వదులుకున్నారు. ఇకనైనా భారత భవిష్యత్తు ఎలా ఉంటుందనేది భారతమాత నేటి సంతానపు సంకల్ప శక్తి పైన, సామర్ధ్యం పైన ఆధారపడి ఉంది. 

- మణి

- సమాప్తం
 
http://www.lokahitham.net/2011/12/12_15.html

No comments:

Post a Comment