మరొక తీవ్రమైన రాజ్యాంగలోపం ఏమంటే రాజకీయ పార్టీలకు ఏ క్రమబద్దీకరణ యంత్రాంగమూ కల్పించలేదు. ఎన్నికల కమిషన్ గుర్తులు ఇవ్వడం కోసం గుర్తింపు నియమాలను చేసిందే కాని నియమావళిని ఉల్లంఘించిన పార్టీలపైన చర్యతీసుకునే అధికారం దానికి లేదు. గుర్తింపు రద్దు అనే చర్య అసలుశిక్షే కాదు. రాజకీయ పార్టీలు ఎన్ని నేరాలు చేసినా వాటిపైన చర్యలు లేనే లేవు. తీసుకునే అధికారం ఎవరికీ లేదు. అప్రజాస్వామిక ధోరణిని అనుసరించే రాజకీయ పార్టీలను అదుపు చేసే వ్యవస్థ లేదు. అభ్యర్థులను అనర్హులు చేయడానికి ఉన్న అధికారాలు పార్టీలను అనర్హం చేయడానికి ఉపకరించడం లేదు. కనుక అక్రమ, అప్రజాస్వామ్య పార్టీలనుంచి చిట్టి చితక పార్టీలు పుట్టుకు వస్తున్నాయి. పుట్లకు పుట్లుగా పుట్టిన ఈ పార్టీలకు గుర్తులు కూడా కరువైనాయంటే మనదేశంలో పనికి రాని పార్టీలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. వాటిని రద్దు చేసే వ్యవస్థ లేదు.
ఆర్టికిల్ 324 ఎన్నికలు నిర్వహించడానికి అవసరమయ్యే అపారమైన అధికారాలను కమిషన్ కు ఇస్తున్నప్పడికీ అవి ఎన్నికల నిర్వహణకే పరిమితం. ఆ తరువాత ఈ అధికారం ఎవరికీ లేదు. ఆర్టికిల్ 325 కింద జాతికుల మత బేధాలతో ఓటు హక్కుకు లోటు చేయకూడదని, ఆర్టికిల్ 326 వయోజనులైన భారత పౌరులందరికీ ఓటు హక్కు ఉండాలని గ్యారంటీ ఇస్తున్నాయి. ఈ హక్కులను అమలు చేయాలంటే ప్రజాప్రాతినిధ్యచట్టం, 1951 కింద అన్ని నియమాలు అందుబాటులోకి రావాలి. లేకపోతే ఎన్నికలు అర్థవంతంగా ఉండవు. సరయిన ప్రజాప్రతినిధులు అధికారంలోకి రావడానికి వీలుండదు. మనకు రెండు ప్రజాప్రాతినిధ్య చట్టాలు ఉన్నాయి. 1950నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం నియోజకవర్గాల నిర్ధారణ, ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించిన నియమాలు వివరిస్తుంది. 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం లో అభ్యర్థులను అనర్హులను చేసే నేరాలను అక్రమాలను నియమ ఉల్లంఘనలను వివరించారు. విభిన్న కులాలు మతాలు ప్రాంతాల నివాసుల మధ్య శతృత్వాలను రెచ్చగొట్టే 153ఎ ఐపిసి నేరానికి పాల్పడి శిక్షకు గురైతేనే పోటీచేయకుండా అనర్హత వస్తుంది. రేప్ చేసిన వారు, అధికారాన్నివినియోగించి ఆడవారిని లోబరుచుకున్న వారు, కోడలిని భార్యను హింసించే 498ఎ నేరం చేసిన వారు అనర్హులవుతారు. అనేకమంది రాజకీయ నాయకులు ఈ నేరాలు చేస్తూనే ఉన్నారు. కాని కేసులు మోపరు. మోపినా విచారణలు జరగవు. జరిగినా అప్పీలుతో దశాబ్దాలు గడుస్తాయి. చాలా అరుదుగా ఈ నేరంపైన అనర్హతలకు గురవుతారు.
డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి సెక్షన్ 77 కింద ఎన్నికల వ్యయం పైన పరిమితులు విధించి లెక్కలు ఇవ్వాలని నిర్దేశించారు. సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా, అన్యాయంగా, పార్టీలన్నీ ఏకమై అభ్యర్థి ఖర్చులలో పార్టీ ఖర్చు, ఇతరులు ఇతర సంఘాలు కేంద్రాలు పెట్టిన ఖర్చులు కలపకూడదని 1974లో చేసిన దుర్మార్గపు సవరణ ఇంకా అమలులో ఉండడం వల్లనే డబ్బు చెడుప్రభావాన్ని ఎవరూ ఆపలేక పోతున్నారు. లోకసభ ఎన్నికకు 25 లక్షలు, అసెంబ్లీ స్థానానికి 10 లక్షలు వ్యయపరిమితి విధించడం ఎంత హాస్యాస్పదమో దాని అమలు అంత అసాధ్యం కూడా. కడప లోకసభకు పులివెందుల శాసనసభ స్థానాలకు ఇప్పడికే 180 కోట్ల రూపాయల ఖర్చుదాటిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి.
ఎన్నికల గుండె చప్పుడు లబ్ డబ్బుగా మారిపోయింది. అయిదు వందల రూపాయల నోటునుంచి ఒకటి రెండు మూడు దాకా వేయిరూపాయల నోట్లు పంచుతున్నారని మూడుపార్టీలు ఘంటాపథంగా ప్రచారం చేస్తున్నాయి. కార్లలో తరలిపోయే లక్షల రూపాయలు పంపిణీముందు పోలీసులకు దొరుకుతున్నాయి. దొంగలెక్కలు ఇవ్వడం మరో నేరం. దాన్ని కూడా రుజువుచేయడానికి ఏ యంత్రాంగం కూడా ముందుకు రావడం లేదు. కనుక చట్టాలు లేక, ఉన్న చట్టాలు అమలు కాకపోవడం వల్ల రాజకీయ పార్టీలపైన ఎవరికీ ఏ అదుపూ లేదు. మామూలుసొసైటీకి, సంఘానికి, గుడికి, కంపినీకి, ట్రస్టుకు అదుపులు నియంత్రణలు ఉన్నాయి. కాని రాజకీయ పార్టీలకు లేకపోవడం ఒక తీవ్రలోపం.
అక్రమాలు
సెక్షన్ 123 అనైతిక ధోరణులను వివరించింది. ఓటు వేయడానికి లేదా వేయకుండా ఉండడానికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ప్రలోభపెట్టేందుకు అభ్యర్థి లేదా అతని ఏజంటు, అతని అనుమతితో మరొకరు ఓటరుకు కానుక ఇవ్వడం, కానుక ఇస్తానని వాగ్దానం చేయడం అక్రమం. అవాస్తవాలు చెప్పడం, బెదిరించడం కూడా అక్రమాలే అని 123 వివరిస్తుంది. ఈ అక్రమాలు రుజువైతే అభ్యర్థి పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. కాని హైకోర్టులో రుజువు చేయాలి. అది కాలాతీతానికి కారణం కనుక అనర్హులంతా పోటీ చేస్తూనే ఉన్నారు. ఎవరూ కేసులు పెట్టే సాహసం కూడా చేయడం లేదు. నగదుతోపాటు ఫాన్లు, కార్లు, ఇతర వస్తువులు అనేకం ఇస్తున్నారు.
ఎన్నికలలో విపరీత ధోరణులకు కడప ఒక గడపగా మారింది. ప్రజాస్వామ్యం నెత్తిన డబ్బు, మద్యం, అధికారం, కండబలం, ఇతర అనేక ప్రభావాలు ప్రలోభాలు విలయ తాండవం చేస్తున్న వేదిక ఇప్పడి కడప. ఇక్కడ ఉపఎన్నికలు ప్రజలకోసం జరుగుతున్నాయా? మనదేశంలో కుటుంబాలు పార్టీలు విడదీయరానంత మేరకు పెనవేసుకుపోయిన విషయం అందరికీ తెలుసు. బిజెపి, వామపక్షాలు తప్ప దాదాపు అన్నిపార్టీలు ఏదో ఒక కుటుంబానికి అంకితమైన గుంపులు అనుకునే పరిస్తితి వచ్చింది. ఏ పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం అనేది మచ్చుకు కూడా ఉండడంలేదు. అధ్యక్షుడితో విబేధాలు వస్తే వేరే కుంపటి పెట్టుకోవాల్సిందే గాని అసమ్మతికి, విమర్శకు, విభిన్న అభిప్రాయానికి తావే ఉండడం లేదు. అటువంటి కొత్త కుంపటే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని మనుగడకు పరీక్ష అనుకున్న కడప ఉప ఎన్నిక అసలు ప్రజాస్వామ్య మనుగడకే సవాలు గా మారింది. కడపలోకసభ, పులివెందుల శాసనసభ స్థానాల్లో ఓట్లు స్వేచ్ఛగా వేయడం అనేది అసలు జరుగుతుందా అన్న అనుమానం నానాటికి బలపడుతున్నది. ఎన్నికల కమిషన్ మాజీ సలహాదారుడు కె జె రావు మద్యం, డబ్బు విపరీతంగా మున్నెన్నడూ లేనిరీతిలో దుర్వినియోగం జరగబోతున్నదన్నారు. ఈ విషయాన్నిచాలా సీరియస్ గా తీసుకోవలసి ఉంది.
ఇక్కడ అత్యంత సంపన్నమైన పార్టీలు పోటీలో ఉన్నాయి. పాతికేళ్లు మనుగడ సాగించి పదహారేళ్లు అధికారంలో ఉండి వేళ్లూనుకున్న తెలుగుదేశం, అంతకు ముందు దశాబ్దాలపాటు పాలించి, ప్రస్తుతం కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కడపలో ఓడిపోవడం అలవాటు లేని వై ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు ఆయన వారసుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ గెలుపు లక్ష్యంగా అవినీతి నేరారోపణ ప్రసంగాలతో రకరకాల ప్రలోభాలతో ప్రభంజనం సృష్టిస్తున్నాయి.
స్వేచ్ఛ ఇదేనా?
స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించడం అంటే మాటలు కాదు, ఏవిధమైన గందరగోళం లేకుండా ఆలోచించి ఓటు వేసే అవకాశాలు కాపాడడం ఎన్నికల కమిషన్ ముందు ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ముందు పెద్ద సవాల్. ముఖ్యంగా ఈ ఎన్నికలలో ఓటర్లను ఆలోచించకుండా చేసే పరిస్థితులు ఎన్నో కల్పిస్తున్నారు. డబ్బుకన్న, మద్యం కన్న, పెద్ద సమస్య గందరగోళం. ఎవరు ఏమిటో తెలియని స్థితి. మొదటిగందర గోళం వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో చూసి ఓటు ఎవరికి వేయాలి. తమ్ముడికా తనయుడికా? కాంగ్రెస్ పేరు ఎవరిది? వై ఎస్ ఆర్ కాంగ్రెస్ లోనే కన్నుమూసిన నాయకుడు. కాంగ్రెసు పార్టీనుంచి వై ఎస్ ఆర్ ను వేరు చేసి ఆ రెండు పేర్లను కలిపి కొత్తపార్టీ పుట్టించారు. మూడు పార్టీలు వై ఎస్ ఆర్ పేరును మంత్రంలా జపిస్తున్నాయి. ఒకరికి కుటుంబ పెద్ద, మరొకరికి దివంగత ముఖ్యమంత్రి, ఇంకొకరికి విమర్శావస్తువు. జిల్లా పేరు కూడా వై ఎస్ ఆరే. దారుణ ప్రమాదంలో నేతను కొల్పోయినందుకు లభించే సానుభూతి ఎవరికి? తమ్ముడు, తనయుడు, భార్య, పార్టీ ఎవరు అసలు సిసలు వారసులు? సానుభూతి వారసత్వాన్నిరక్త సంబంధం నిర్ణయిస్తుందా? పార్టీ బంధం నిర్ణయిస్తుందా? ఓటరుకు కనీసం ఆలోచించుకునే అవకాశం లేదు. భార్యకు సంబంధించినంత వరకు సానుభూతి వారసత్వంలో మరో సందేహం లేదని మన రాజకీయ సానుభూతి చరిత్రను బట్టి చెప్పుకోవలసిన మాట. తనయుడి సానుభూతి హక్కు ఇప్పుడు రాజకీయ సవాలుగా మారింది.
జన్యుపరంగా గుణగణాలకు ఆ తరువాత జబ్బులకు వారసత్వం తనయులకు లభిస్తుంది. చట్టపరంగా డబ్బులకు కూడా వారే వారసులు. సమాజంలో గుర్తింపు కూడా కుటుంబానికే. కాని రాజరికల వారసత్వాలుపోయిన తరువాత రాజకీయాలకు పదవులకు వారసత్వం ఉండదు. కాని ఇది కేవలం ఒక ప్రజాస్వామ్య సిద్దాంతంగా మిగిలిపోవడానికి దుర్మార్గ పదవీలాలసత్వరాజకీయాలు కారణం. వారసత్వ రాజకీయాలను అనుసరించే కుటుంబాలు మనదేశంలో కోకొల్లలు. పంచాయతిలో వార్డునుంచిడిల్లీ గద్దె దాకా వారసత్వ రాజకీయాలకే దక్కుతున్నాయి. సమాజాన్ని చూడని గృహిణిని కూడా ఎన్నికల బరిలోకి దించేది ఈ లక్షణమే. ప్రజలనుస్వేచ్ఛగా ఆలోచించనీయకుండా ఆపే అప్రజాస్వామిక స్థితి. మొదటి దుర్మార్గం సానుభూతి అయితే రెండో దుర్మార్గం వారసత్వం. ఈ రెండిటికోసం నానాగడ్డికరిచే పోటాపోటీతో గందరగోళం సృష్టించడం మూడో దుర్మార్గం.
స్వయంగా మంత్రి, నియోజకవర్గానికి ఇంచార్జిగా ఉన్న కన్నాలక్ష్మీనారాయణ తన ఇంటిపైన పోలీసులు దాడిచేసారని, ఒక మీడియా పక్కనుండి ఈ దాడిచేయించిందని ఆరోపించడం వల్ల ఇక్కడ స్వేచ్ఛతో ఓటర్లు ఓటు వేయగలరా అనే అనుమానాన్ని బలపరుస్తున్నాయి. హత్యలు జరుగుతున్నాయి. ఫలానావారికి ఓటు వేస్తే బట్టలు విప్పించి కొడతామని బెదిరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలాదిమందిమీద బైండోవర్ కేసులు పెడుతున్నారు. మంత్రులు అధికార పార్టీ పక్షాన పరివారాన్ని వెంటేసుకుని ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రచారానికి వచ్చిన నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. మీడియా చానెల్స్ తమ యాజమాన్య ప్రయోజనాలను బట్టి పక్షపాతాన్ని బట్టి ప్రచారాలను సాగిస్తున్నాయి. వార్తల అమ్మకం అనే నైతిక పతనం ప్రతి ఎన్నికల్లో కనిపిస్తున్నా, ఈ ఉప ఎన్నికలో మాత్రం ఎవరి అనుకూల పార్టీకి ఆ మీడియావారు అండగా నిలిచి అతిశయోక్తులు గుప్పిస్తున్నారు. ఏది నిజమో తెలుసుకోవడం సాధ్యం కాని తీవ్రగందరగోళం కడప ఉప ఎన్నికల ఓటరుముందున్న సవాల్.
అసలు పార్టమెంటరీ ప్రజాస్వామ్యమే అనుమానాస్పదంగా మారుతున్నదనడానికి ఈ ఎన్నికలు తార్కాణం. పార్టీలలో నియంతృత్వం, పాలనలో అవినీతి, అక్రమసంపాదనకు వారసత్వం, లెక్కకు మించిన డబ్బు, లెక్కలేని పంపిణీ, పరిమితిని పట్టించుకోని ఖర్చు, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, అవాస్తవాలు, మతప్రలోభాలు, కులాల పరిగణన, తప్పుడు కేసులు, ప్రలోభ పెట్టే వాగ్దానాలు, హింస….ఒకటేమిటి, ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐ పి సి లో పేర్కొన్న నేరాలన్నీ కడపలో జరుగుతున్నాయి. ఎవరి అవసరాల ప్రకారం వారు వ్యవహరిస్తున్నారే గాని స్వేఛ్ఛగా ఎన్నికలు జరిపించాలని అడుగుతున్నారే కాని, వారే అన్నిరకాల అక్రమాలకు పాల్పడుతున్నారని ఎత్తిచూపగల వారు, చర్యతీసుకునే వారు అసలెవరైనా ఉన్నారా? ఇవే ఎన్నికలని ఎవరైనా అనుకుంటే వెంటనే ఈ బూటక నాటకాన్ని ఆపేందుకు పౌర సమాజం నడుం కట్టాలి. ఈ అవినీతి, అవకాశ వాద, గోడమీది పిల్లి నేతల భరతం పట్టాలి.
No comments:
Post a Comment