భారతదేశం భవిష్యత్తుపై ఆశతో, సమాజ శరీరానికి అయ్యిన గాయాలతో.. నెత్తురోడుస్తూ.. మౌంట్ బాటెన్ కుయుక్తులతో.. మత పరంగా విభజింపబడి.., లక్షలాది శవాల మధ్యన.. 1947 ఆగస్టు 15 న బ్రిటిషు వారి నుండి స్వాతంత్ర్యాన్ని పొంది 1950 లో రాజ్యాంగాన్ని నిర్మించికొని సకల మర్యాదలతో మౌంట్ బాటెన్ కు వీడ్కోలు పలికింది.
సర్దార్ పటేల్ మొక్కవోని దీక్షతో విడిపోయిన హృదయాలను అతికించి, జన సామాన్యాన్ని కలిపారు. 1951 అక్టోబర్ 25 న రాజ్యాంగం అనే నిబద్ధతను ఏర్పరచుకొని రాజకీయ విలువలను ఏర్పరిచే ప్రయత్నంతో మొట్టమొదటి ఎన్నికలను హిమాచల్ ప్రదేశ్ లో చీని, అంగీ అనే వోటర్లు వోటు వేయడంతో ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు బీజం పడింది.
1951 లో జరిగిన మొట్టమొదటి ఎన్నికలలో ఒక వోటుకు కేవలం 98 పైసలు ఖర్చయ్యాయి. ఈ ఎన్నికలలో 2438 మంది ఎంపీలుగా ఎన్నికయ్యేందుకు పోటీ పడ్డారు. పదిహేడు కోట్ల మంది వోటర్లు మొదటి పార్లమెంటు ఎన్నికలలో వోటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ, నెహ్రు, జయప్రకాశ్ నారాయణ వంటి హేమాహేమీలు దేశ వ్యాప్తంగా పర్యటించి ప్రజాస్వామ్యానికి ఊపిరులూదేందుకు కృషి చేశారు.
శాంతీ-శాంతీ అనే భ్రమ, ప్రపంచ నిజాలు 1962 చైనా యుద్ధంతో నెహ్రూకు తెలిసొచ్చాయి. ఆ తరువాత లాల్ బహదూర్ శాస్త్రి నేతృత్వంలో జైజవాన్ - జైకిసాన్ నినాదంతో కర్షకుడికి, యుద్ధంలోని సైనికుడికి గౌరవమిచ్చే సమాజ నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి. హరిత విప్లవంతో దిగుబడి పెంచి వ్యవసాయం లాభ దాయకమయ్యేలా, అందరికీ ఆహారం అందేలా ప్రణాళికల స్వరూపాన్ని లాల్ బహదూర్ నాయకత్వం రెండేళ్లలో దేశానికి అందించింది.
అనుమానాస్పద పరిస్థితులలో శాస్త్రీజీ మరణించడంతో ఇందిర ప్రధానిగా ఎన్నికైంది. 1971 లో పాకిస్తాన్ పై యుద్ధం జరిగినప్పుడు ఇందిర తెగువ చూపి బంగ్లాదేశ్ కు ప్రాణం పోసినా, మరల శాంతి మాయలో చిక్కుకొని కాశ్మీర్ గాయాన్ని మాన్పించే చక్కటి అవకాశాన్ని వదులుకొని కాళ్ళ బేరానికి వచ్చిన పాకిస్తాన్ ను వదిలిపెట్టింది. అప్పటి వరకూ ప్రపంచమంతా ఆదర్శంగా తీసుకున్న ప్రజాస్వామ్యం.. 1975 లో స్వార్ధ ప్రయోజనాల కోసం, నియంతృత్వ పోకడలతో ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య జీవనాన్ని అపహాస్యం చేస్తూ స్వేచ్చాయుత జీవనాన్ని చీకట్లోకి నెడుతూ, ఒక సంవత్సరం ఎనిమిది నెలల పాటు ఎమర్జెన్సీని విధించడంతో..
సహజంగా చలిత పరిణామం కలిగిన, వెలుతురుని ప్రేమించే సగటు భారతీయుడు సృష్టించిన అలల తుఫానుకు, యువరక్తపు చైతన్యములో ఎగిసిన అలలు సమాజ సముద్రం లో ప్రజాస్వామ్య తుఫానుగా మారి, ఎమర్జెన్సీ తొలగి 1977 లో మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది.
ఆ తరువాత రాజీవ్ గాంధీ, వి.పి.సింగ్, చంద్ర శేఖర్, పీవీ నరసింహారావు, దేవగౌడ, అటల్ బిహారీ వాజపాయ్ ల సారధ్యములో ప్రజాస్వామ్యంలో కొత్త కొత్త పాఠాలను నేర్చుకొంటూ ఇటలీ వనితను ప్రధాని కాకుండా ఈ ప్రజాస్వామ్యం అడ్డుకోగలిగి, ప్రస్తుతం మన్మోహన్తో కలిపి ఇప్పటి వరకూ 13 మంది ప్రధాన మంత్రులను, 370 కి పైగా ముఖ్యమంత్రులను, 7900 లకు పైగా పార్లమెంటు సభ్యులను, 50100 కి పైగా ఎం.ఎల్.ఏ. లను ఎన్నుకొని బహుముఖ ఆలోచనలతో, స్వేచ్ఛాయుత సమాజంతో అందరినీ కలుపుకొంటూ, 80 % వోటర్ల హాజరుతో, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, కుగ్రామంలోని వోటరు అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తూ, వోటరు గుర్తింపు కార్డులతో, సరికొత్త వోటింగు యంత్రాలతో, ఒకవైపు ఆరోపణలతో, రిగ్గింగులతో, విభజన రాజకీయాలతో, మరొక వైపు స్వేచ్చతో, ఐక్యతతో, అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తూ, ఎగ్జిట్ పోల్ ని అవహేళన చేస్తూ వోటరు దేవుడు ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతూనే ఉన్నాడు.
కులాల శాతానికి, మతాల బుజ్జగింపులకు తాను లొంగనని, స్వచ్ఛమైన నాయకత్వం ఉంటే మార్పు తెస్తానని వోటర్లు ఎన్నోసార్లు రుజువు చేసారు...,
1951 లో వోటుకు 98 పైసలు ఖర్చు అయితే ఇప్పుడు వోటుకు 250 రూపాయలు ఖర్చు కావడం విశేషం. అరవై ఏళ్ళయినా గరీభీ హఠావో నినాదం ఇంకా ఒక అజెండాగా ఉండడం మనం తీవ్రంగా ప్రశ్నించుకోవలసిన విషయం.
- జి.ఎల్.యెన్.
No comments:
Post a Comment